Sunday, April 6, 2014

తెలంగాణా కోసం సిద్ధమవుతున్న ఛానెల్స్

తెలంగాణా ఏర్పాటు కావడంతో ప్రధాన తెలుగు ఛానెల్స్ ఆ రాష్ట్రం లో ప్రసారాల కోసం ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నాయి. ప్రముఖ 'ఈనాడు' గ్రూపు ఈ నెల తొమ్మిదిన Etv-3 ని తెలంగాణా ఛానెల్ ను ఆరంభిస్తున్నది. 

సాక్షి వాళ్ళు కూడా తెలంగాణా ఛానెల్ కోసం ఒక ఛానెల్, హైదరాబాద్ కోసం ఒక ఛానెల్ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారమ్. 

తెలంగాణా కోసం..ఎన్నికల తర్వాత NTV Plus పేరిట ఒక ఛానెల్ ఏర్పాటు చేయాలని దాని యజమాని నరేంద్ర చౌదరి భావిస్తున్నట్లు ఇన్ సైడ్ వర్గాల కథనమ్. ఎన్ టీవీ ని ఆయన ప్రత్యేకించి ఆంధ్రా ప్రేక్షకుల కోసం వాడుకుంటారట.

దాదాపు అన్ని ఛానెల్స్ రెండు రాష్ట్రాల కోసం ప్రత్యేక డెస్క్ లు వగైరా ఏర్పాటు చేస్తుండగా... మార్కెట్ లీడర్ టీవీ నైన్ మాత్రం ఈ దిశగా ఏమీ ఏర్పాట్లు చేయడం లేదు. తెలుగు వీక్షకుల కోసం ప్రాధాన్యాన్ని బట్టి ఒకే ఛానెల్ ద్వారా వార్తలు అందించాలని రవి ప్రకాష్ భావిస్తున్నారని సమాచారం.   

Thursday, April 3, 2014

ప్రముఖ స్పోర్ట్స్ ఎనలిస్టు నరేందర్ మృతి...సంతాప సభ శనివారం

ఆంధ్రజ్యోతి, ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రికలలో స్పోర్ట్స్ జర్నలిస్టు గా పనిచేసి...మంచి క్రికెట్ విశ్లేషకుడిగా పనిచేస్తున్న రేవెల్లి నరేందర్ గారు నిన్న మరణించారు. ఆయన వయస్సు 49 సంవత్సరాలు. ఆయన సతీమణి ఉష గారు ఆల్ ఇండియా రేడియో లో న్యూస్ రీడర్ గా పనిచేస్తున్నారు.

సొంత పట్టణమైన కరీంనగర్ లో 'జీవగడ్డ' అనే పత్రిక ద్వారా జర్నలిజం లోకి అడుగుపెట్టిన నరేందర్ గారు 1996 లో ఆంధ్రజ్యోతి లో స్పోర్ట్స్ విభాగం లో చేరారు. 1996  ప్రపంచ కప్ క్రికెట్ పోటీలతో పాటు అనేక జాతీయ, అంతర్జాతీయ టోర్నమెంట్లను ఆయన కవర్ చేసారు. ఆ తర్వాత హైదరాబాద్, భువనేశ్వర్ లలో ఇండియన్ ఎక్స్ ప్రెస్ కోసం పనిచేసారు.
ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్ లలో ఫ్రీలాన్సర్ గా, అసోసియేటెడ్ ప్రెస్ కు కంట్రి బ్యూటర్ గా సేవలు అందించారు. ఆయన మూర్తి పట్ల ఆంధ్ర ప్రదేశ్ స్పోర్ట్స్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసింది.  ఇందుకు సంబంధించిన సంతాప సభను వచ్చే శనివారం ప్రెస్ క్లబ్ లో సాయంత్రం నాలుగు గంటలకు ఏర్పాటు చేసినట్లు అసోసియేషన్ ఒక ప్రకటనలో తెలిపింది.

Sunday, March 16, 2014

మీడియాలో ఉద్యోగాలు...పరిణామాలు...

1990 ప్రాంతంలో మీడియా చాలా పరిమితంగా ఉండేది. 'ఈనాడు' కు గుండెకాయ అని రామోజీ రావు గారు చెప్పే జనరల్ డెస్క్ లో 1992 లో చేరాను. గిరీష్ సంఘీ గారి 'వార్త' పుట్టుకొచ్చే దాకా మాకు 'ఈనాడు' మాత్రమే గతి. వేరే ఆప్షన్ లేదు. ప్రమోషన్లు గట్రా లేకపోయినా... చాలా బాగా పనిచేసే వాళ్ళం. నెలకు 6400 వచ్చే నన్ను 'వార్త' కు రమ్మని, చీఫ్ సబ్ పోస్టు ఇస్తామని ఒక పెద్ద మనిషి ఒత్తిడి చేసారు. కనీసం పది వేలు ఇవ్వాలని అడిగాను కానీ ఆయన 8500 దాకా వచ్చాడు. 

గిరీష్ సంఘీ తన ఫ్యాక్టరీ లో ఉద్యోగులను గూండాలతో కొట్టిస్తాడని అప్పట్లో ప్రచారం జరిగింది. మనకేమో ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం... తప్పు అనుకున్నదాన్ని ఉన్నపళంగా ఖండించడం... పక్కవాడి సమస్యకు కూడా మనమే గళమెత్తడం అలవాటు. ఎందుకొచ్చిన గొడవలే... అని అక్కడ పనిచేసాను...మా బ్యాచ్మెట్లు అంతా వేరే వృత్తులలోకి వెళ్ళిపోయినా. 

జర్నలిజంలో జంపింగ్ లు చేయకుండా...ఒకే సంస్థను నమ్ముకుని ఉండడం వృత్తి ఎదుగుదల రీత్యా తగదని కొందరు జాతీయ స్థాయి జర్నలిస్టులను చూస్తే అర్థమయినా...'ఈనాడు' లాంటి పరమ గొప్ప పత్రికను మనం వదలడం ఈ ప్రజాస్వామ్యానికి మంచిది కాదని అనుకునే వాళ్ళం. అలా...కుల-ప్రాంత-వ్యక్తి సంబంధ ద్వేషాలకు బలై ఒక్క ప్రమోషన్ అయినా లేకుండా దాదాపు పదేళ్ళు పనిచేసి 'ది హిందూ' లో చేరాను ఏషియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజం కోర్సు చలవ వల్ల. 

కానీ... ఈ రోజుల్లో జర్నలిస్టులను చూస్తే జాలేస్తుంది, భయమేస్తుంది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు జంపింగుల మీద జంపింగులు చేస్తున్నారు. భారత దేశంలో రాజకీయ పార్టీల మాదిరిగా తెలుగుదేశంలో టీవీ ఛానెల్స్ తామర తంపరగా పుట్టుకు రావడం ఒక రకంగా వారికి వరమయ్యింది. అందుకే ఒకప్పుడు ప్రింట్ లో ఉన్న జర్నలిస్టులు టీవీ ఛానల్స్ లోకి దూకి... ఒక నాలుగైదు చానల్స్ మారారు... మార్కెట్ వేటలో. 

నాకు తెలిసిన ఒక డొక్కశుద్ధి, సరుకున్న జర్నలిస్టు... కాలేజ్ కాగానే ముందుగా.. 'ఈనాడు' లో చేరారు. యాజమాన్య సమస్యతో 'ఆంధ్రప్రభ' కు మారారు. తర్వాత 'వార్త'.. 'అంధ్రభూమి' కవర్ చేసుకుని... 'డెక్కన్ క్రానికల్' ద్వారా ఆంగ్ల జర్నలిజం లోకి అడుగు పెట్టారు. అక్కడి నుంచి 'హిందూ' లో ఒక ప్రయత్నం చేసి 'టైమ్స్ ఆఫ్ ఇండియా' లో చేరారు.
 
అక్కడి నుంచి టీవీ నైన్ ద్వారా ఇడియట్ బాక్స్ జర్నలిజం లో అడుగు పెట్టారు. అక్కడ మంచి స్టోరీలు చేస్తూనే...ఒక బంపర్ ఆఫర్ తో 'సాక్షి' లో చేరారు. వైఎస్ పోయాక... పరిస్థితులు చూసి 'జెమిని' లో చేరి... ఆనక 'సీ వీ ఆర్' సరసన చేరారు. ఇప్పుడు కొత్తగా వచ్చే ఒక ఛానల్ లో శుభ్రంగా సెటిల్ అయ్యారు. ఈ జంపింగ్ జపాంగ్... మంచిదా కాదా అంటే... దానికి సమాధానం లేదు. ఒక మంచి జర్నలిస్టుకు మీడియా నిలదొక్కుకునే అవకాశం ఇవ్వకుండా చేయడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని కూడా అనుకోవచ్చు. ఇలాంటి వాళ్ళను నిత్య సంచలన శీలురని అనుకుందాము మర్యాద కోసం. 

ని.సం.శీ.లు మీడియాలో ఈ మధ్యన ఎక్కువయ్యారు. మా రాజశేఖర్ మాత్రం మరీ ఇలా చేయడం లేదు. ఈనాడు జర్నలిజం స్కూల్ తర్వాత.. ఈ టీవీ, టీవీ నైన్, ఐ న్యూస్, ఇప్పుడు ఎన్ టీవీ. అయన త్వరలో హెచ్ ఎం టీవీ లో చేరతారని ప్రచారం జరుగుతోంది. అది నిజం కావచ్చు, అబద్ధం కావచ్చు. బిజినెస్ సూత్రాలు చేతిలో పట్టుకుని.... బుర్ర నిండా పదునైన ఆలోచనలతో ఉండే ఇలాంటి మిత్రులకు పర్వాలేదు కానీ... సాధారణ జర్నలిస్టులకు మాత్రం ఇది మంచికన్నా చేటే చేస్తుంది. జర్నలిజం లోకి వచ్చి.... సిగ్గూ, ఎగ్గూ లేకుండా...అబద్ధాలు చెప్పైనా బతకాలని అనుకోవడం మంచిదా కాదా అనేది వ్యక్తిగతమైన విషయం కదా! అబద్ధాలే పరమావధిగా బతకడం...యాజమాన్యాలకు తప్పుడు సలహాలు ఇచ్చి బూతును ప్రోత్సహించడం...పాపం... పొట్ట కూటి కోసం వారి చేతగానితనం. 

జర్నలిస్టుల జీవితాల్లో మరీ అంత అనిశ్చితి మంచిది కాదని నాకు అనిపిస్తుంది. ఇలా అనిశ్చితి ఉంటే... చేతిలో గొట్టం ఉన్నప్పుడే బ్యాంకు బ్యాలెన్స్ పెంచుకోవాలన్న ధోరణి ప్రబలుతుంది. ఈ వెర్రి ఆలోచనతో జర్నలిజం మరింత పలచన అవుతుంది. వృత్తి విలువలు మంట గలుస్తాయి.

Friday, February 28, 2014

వైజాగ్ కేంద్రంగా 'వై టీవీ'-ఉద్యోగార్ధులు ఇది చదవండి....

తెలంగాణా బిల్లుకు ఆమోద ముద్ర పడిన తర్వాత... మీడియా మిత్రులకు సుభవార్త. వైజాగ్ కేంద్రంగా యలమంచిలి వారి ఆధ్వర్యంలో ఒక న్యూస్ కమ్ ఎంటర్ టైన్మెంట్ ఛానెల్ రాబోతున్నది. 

ఇన్నాళ్ళూ హెచ్ ఎమ్ టీవీ లో ఫీచర్స్ చూసిన ఎమ్. రాజగోపాల్ గారు దాని చీఫ్ ఎడిటర్ గా చేరుతున్నారు. ఈ ఉదయం ఆయన ఈ విషయాన్ని దృవీకరించారు. బ్యాంకర్, రియల్టర్, యలమంచిలి చిట్స్ ఓనర్ యలమంచలి వెంకటేశ్వర రావు గారు దీని ఓనర్ అట. "సీమాంధ్ర రాష్ట్రం నుంచి వస్తున్న మొట్ట మొదటి తెలుగు ఛానెల్ ఇది," అని రాజగోపాల్ గారు చెప్పారు. 
ఇంకొక మంచి విషయం ఏమిటంటే... వైజాగ్ లో స్థిరంగా ఉండి ఉద్యోగం చేసుకోవాలనుకునే వారు... ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 

మీ దరఖాస్తులు పంపవలసిన మెయిల్ ఐడి:
mangurajagopal@gmail.com


"Besides talent, preference will be given to those who were mercilessly dismissed by managements," అని కూడా రాజగోపాల్ గారు నాకు పంపిన ఒక సందేశంలో పేర్కొన్నారు...చాలా కసిగా. ఆయనను కలిసి చాలా రోజులయ్యింది. 2012 ఫిబ్రవరి లో ఆయన పుస్తక ఆవిష్కరణ  సందర్భంగా కలిసాను. 

Thursday, February 27, 2014

పొద్దటి పూ దొంగలు... రెడ్ రోజ్ టీ.. లుక్మీ

హైదరాబాద్ నగరంలో పొద్దున్నే లేచి బైటికి వెళ్లి... చూసే మనసు ఉండాలి గానీ... వింత అనుభవాలు ఎన్నో ఎదురు అవుతాయి. ఇవ్వాళ ఉదయం...మా వాడు ఫిజికల్ ఫిట్నెస్ కోసం వెళ్దామని 5.30 కు లేపితే కలత నిద్రలో లేచి... మగత నిద్రతో కారు బైటికి తీశాను. 

కారు వెనక... చేతిలో ప్లాస్టిక్ సంచీతో ఒక వ్యక్తీ నిలబడి ఉన్నారు మసక చీకట్లో. తలకు మంకీ క్యాపు... స్వట్టరు ధరించిన ముదుసలి. అపార్టు మెంటు లోకి ఇంత పొద్దున్నే ఎలా వచ్చారా? అని అనుకున్నాను. బహుశా మా అపార్ట్ మెంట్ లో ఉండే వ్యక్తే అనుకుంటా. లేకపోతే.. అంత ధైర్యంగా ఎలా లోపలి వస్తారు? నన్ను చూసి ఒక క్షణం ఆగి... మళ్ళీ తన పని తాను కానిస్తున్నారాయన. ఇంతకూ ఆయన చేస్తున్న పని... పూలు కోయడం.  సర్లే.. మనకెందుకు వచ్చిన గొడవని మా మానాన మేము లాల్ బహదూర్ స్టేడియం కు వెళ్ళాం. 

వాళ్ళకేమి రోగమో గానీ... స్టేడియం ఉన్నట్టుండి మూస్తారు. నాకు మండుతుంది... కానీ ఏమి చేస్తాం? మూసుకుని ఇందిరా పార్క్ కు పోనిచ్చాను. అక్కడ పిల్లలు శాండ్ రన్నింగ్ చేస్తారు. వారంలో రెండు మూడు సార్లు అది చేయడం మంచిదని కోచ్ చెబుతారు. ఇందిరా పార్క్ లో పూలు, యోగాసనాలు చేసేవాళ్ళు, నాకన్నా ఉత్సాహంగా ఉల్లాసంగా నడిచే వృద్ధులు...మంచిగా అనిపిస్తారు. కాకపొతే... ఇందిరా పార్కు లోకి పోగానే నా బీ పీ నాకు తెలియకుండానే పెరుగుతుంది. కారణం.. సుసర్ల నగేష్. మొన్నీ మధ్యన ది హిందూ నుంచి దాదాపు గెంటివేతకు గురైన నగేష్.. వైద్యురాలైన భార్యతో కలిసి వాకింగ్ కు వస్తారు. 2007 డిసెంబర్ 25 న నా మీద అవినీతి ఆరోపణలు చేసిన ఆయన అంటే నాకు పరమ చికాకు, అసహ్యం. పొద్దు పొద్దున్నే పూలను, నగేష్ ను ఒకే కళ్ళతో చూడడం ప్రారబ్ధం. నగేష్ ఎక్కడ కనిపిస్తారా? అని సంశయపడ్డాను...ఈ రోజుకు ఆయన రాకపోవడమో, ఆలస్యం కావడమో అయి నాకు ఆయన కనిపించలేదు. 

సరే... మా వాడి బాగు మోస్తుండగా... గతంలో నేను ఈనాడు లో పనిచేసినప్పుడు ఉన్న ఒక సీనియర్ కనిపించారు. బాగానే పలకరించాడు. ఆ పక్కనున్న ఒక లాయర్ కు నన్ను పరిచయం చేస్తూ... "మీ సూరావజ్జుల రాము. మీ ఖమ్మం జిల్లా వాడే," అని చెప్పాడు. ఇదేమి పరిచయమో నాకు అర్థం కాలేదు. సరే కొద్దిగా మాటా మంచీ అయ్యాక.. 'ఏమి చేస్తున్నారు?' అని అడిగాను. ఎక్కడా పనిచేయకుండా... సోషల్ యాక్టివిస్ట్ గా ఉన్నాననీ, అన్ని రకాల అభివృద్ధి నమూనాలను... విడవకుండా విమర్శిస్తానని... వారు చెప్పారు. ఇంత పెద్ద విషయాలు మనకెందుకని... వారి నించి సెలవు తీసుకుని... నేను ఒక మూలాన వాకింగ్ చేసాను. 

కొద్ది సేపు ఆగిన తర్వాత... ఒంటి నిండా చెమటతో ఫిదెల్ వచ్చాడు. ఎందుకో తనకు నా మనసులో మాట చెప్పాలని అనిపించింది. "నాన్నా...ఈ పార్కు కు వస్తే... నా మనసు కకావికలం అవుతుంది," అని ఆరంభించాను. ఎందుకని తను ఆసక్తిగా అడిగితే... జర్నలిస్టుగా నేను ఎంత స్వచ్ఛంగా, నీతిగా బతికిందీ... అప్పటి నా బాస్ హోదాలో నగేష్ నా మీద చేసిన అవినీతి ఆరోపణలు.... వాటి వల్ల నేను పడిన మానసిక వేదన...'ది హిందూ' వదలడం ఉత్తమమని నేను అనుకోవడం... చివరకు అవమానకర పరిణామాల మధ్య నగేష్ ఆ పత్రిక నుంచి వెళ్లి పోవడం... వివరంగా చెప్పాను. కొద్దిగా మనసు తేలికై పార్కు నుంచి బైటికి వస్తుండగా..."ఇలాంటి వాళ్ళ గురించి బ్లాగులో రాయకు డాడీ.." అని 14 ఏళ్ళ కొడుకు హితవు చెప్పాడు. 

తర్వాత... ఈ రోజు ఫిదెల్ కు ఇరానీ చాయ్ తాగించాలని అనిపించింది. నా ప్రతిపాదనకు తనూ ఉత్సాహం చూపించాడు. ఒకటి నీలోఫర్ ఆసుపత్రి దగ్గర ఉంటుంది కానీ.. నిమ్స్ దగ్గర ఉన్న రెడ్ రోజ్ కు తీసుకు పోయాను. అక్కడ బైట కారు పార్క్ చేసి లోపలికి వెళ్ళాను. అక్కడ ప్లేట్ల లో లుక్మీ చూస్తే ప్రాణం లేచివచ్చింది. 1992 లో నేను 'ఈనాడు' లో పనిచేసిన రోజులు గుర్తుకు వచ్చాయి. అప్పట్లో ఈ లుక్మీ లేదా బ్రెడ్ టీ తో కలిపి తిని బ్రేక్ ఫాస్ట్ అయ్యిందని అనిపించే వాళ్ళం. అది ఖర్చు తక్కువ తిండి. మా వాడి కోసం లుక్మీ, టై బిస్కెట్, ఇరానీ చాయ్ ఆర్డర్ ఇచ్చాను. తను వాటిని ఆస్వాదిస్తే... మజా అనిపించింది. పూరీ ప్రియుడైన తనకు లుక్మీ నచ్చడం నాకు ఆనందాన్ని ఇచ్చింది.

ఆ తర్వాత కొద్ది దూరం వెళ్ళాక...ఊదా రంగు పూలు కనిపించాయి. నేను వాటిని చూస్తూ ఉండగానే.... గోడ మీద నుంచి వాటిని కోస్తూ.. ఒక పండు ముదుసలి కనిపించారు. ఆయన ఒక పకడ్బందీ కవర్ లో ఆ వీధిలో రక రకాల పూలు కోస్తున్నారు. అది దొంగతనం అనలేం గానీ... పెద్ద మనుషులు వాకింగ్ చేస్తూ... పూలు లేపెయ్యడం... సరదాగా అనిపించింది. అది వారిని ఆనంద పరిచే అంశాల్లో ఒకటి. ప్రకృతి మనలను వివిధ రకాల రంగు రంగుల పూలతో, వివిధ రకాలుగా ఆనందింప చేస్తుంది కదా!           

Thursday, February 20, 2014

హమ్మయ్య... ఒక పెద్ద గొడవ తీరింది...

తెలంగాణా ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిన సుదినం. 
వందల మంది వెర్రి ఆవేశంతో జీవితాలు నుదిమేసుకున్న త్యాగానికి నిజమైన నివాళి.
దోపిడీ, అది నిత్యం జరుగుతుందన్న ఫీలింగ్ నిజంగానే అంతం అవుతుందా? అన్న సంశయం.
తెలంగాణా సుసంపన్నం అవుతుందా? అన్న అనుమానమ్.  
తెలుగు జాతి మన కళ్ళ ముందే రెండు గా అయిపోయిందే...అన్న కించిత్ బాధ.
ఇప్పటికే జరగాల్సింది ఈ రోజైనా జరిగిందన్న తృప్తి. 
మా నీళ్ళు మాకు... మా ఉద్యోగాలు మాకు... నిజంగా నిజం కావాలన్న సంకల్పమ్.  

ఇదొక అనిర్వచనీయమైన ఉద్విగ్న క్షణం. 

రాజకీయ నేతల చదరంగంలో ఇన్నాళ్ళూ పావుగా మారి... ప్రజల్లో ఆవేశకావేషాలు పెంచి... వందల మంది యువకులు బలిదానాలు చేసుకోవడానికి కారణమైన తెలంగాణా సమస్య ఒక కొలిక్కి రావడం ఆనందాన్ని ఇచ్చింది. లోక్ సభ బిల్లు ను ఆమోదించిన రోజు అనుకోకుండా కళ్ళ వెంట నీళ్ళు తిరిగాయి. 

'జై తెలంగాణా' అంటూ శరీరాన్ని అగ్నికి ఆహుతి చేసుకున్న అనేక మంది యువకులు గుర్తుకు వచ్చారు. నిత్య అగ్ని గుండంగా మారిన మా ఉస్మానియా క్యాంపస్ స్ఫురణకు వచ్చింది.
కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు భాషా పటిమ... ఉద్యమ స్ఫూర్తి రగిల్చే తత్త్వం, మంత్రాంగం నిర్వహణా సామర్ధ్యం లేకపోతే ఈ ఉద్యమం ఇంత స్థాయికి వచ్చేది కాదు.   
29 వ రాష్ట్రంగా తెలంగాణా ఏర్పడినాక...నిన్నటి దాకా జరిగిన పోరాటాలు, వాదాలు పక్కన పెట్టి... అందరం కలిసుందాం.... అంటూ ఆయన చేసిన ప్రసంగం నాకు నచ్చింది. 

"మీ ఖమ్మం జల్లా వాళ్ళకు మెదడు మోకాల్లో కాదయ్యా.. అరికాల్లో ఉంటుంది," అని పదే పదే అంటూ అవమానించిన అప్పటి ఈనాడు ఎమ్ డీ రమేష్ బాబు, "ఉస్మానియా వాళ్ళు... ఉద్యోగాలు ఇవ్వకూడదు..." అని నాతో ఏకంగా అన్న  నాగయ్య చౌదరి కూడా ఇవ్వాళ గుర్తుకు వచ్చారు. 

మీడియా ఈ ప్రాంతీయ వాదుల చేతిలో ఉండబట్టి... జర్నలిజం లో తెలంగాణా జర్నలిస్టులు ఒక స్థాయి వరకే ఎదిగారు. అలాంటి బాధితుల్లో నా లాంటి వాళ్ళు ఎంతమందో ఉన్నారు. ఇలాంటి... ప్రాంత గజ్జి గాళ్ళను, కుల గజ్జి గాళ్ళను, బట్టేబాజ్ గాళ్ళను తన్ని నేషనల్ హైవే నంబర్ నైన్ మీదుగా పొలిమేరలు దాటిస్తే తప్పేమిటన్న  కసిని గుండెల్లో అంతం చేసి... ముగిస్తాను. 
జై తెలంగాణా... 
జై తేట తెనుగు జాతి....  

Tuesday, February 11, 2014

"ది హిందూ" నుంచి అర్ధంతరంగా నగేష్ నిష్క్రమణ

వివాదాస్పద సీనియర్ జర్నలిస్టు సుసర్ల నగేష్ కుమార్ నాటకీయ పరిణామాల మధ్య 'ది హిందూ' నుంచి నిన్న సాయంత్రం అర్థంతరంగా నిష్క్రమించారు. అత్యంత ప్రతిభాశాలి అయిన జర్నలిస్టు కె. శ్రీనివాస రెడ్డి ని తన స్థానంలో హైదరాబాద్ రెసిడెంట్ ఎడిటర్ గా నియమించడం, తనకు వేరే పొజిషన్ (కన్సల్టింగ్ ఎడిటర్ అట) ఇవ్వడం పట్ల అలిగి ఆయన రాజీనామా చేసినట్లు ఆ సంస్థ వర్గాలు వెల్లడించాయి. 

"సాయంత్రం ఐదున్నర ప్రాంతంలో ఆయన రాజీనామా లెటర్ పంపారు. అనూహ్య రీతిలో ఒక అర్ధగంటలో యాజమాన్యం దాన్ని ఆమోదించింది. మా సంస్థలో ఆ స్థాయి వ్యక్తిని ఇంత తొందరగా సాగనంపడం చాలా అరుదు," అని ది హిందూ లో పనిచేసే ఒక జర్నలిస్టు చెప్పారు. పై ఫోటో లోమధ్యలో...కాస్త పొట్టతో ప్యాంటు జాబుల్లో చేతులు పెట్టి తెల్ల చొక్కా ధరించిన మాస్టారే సుసర్ల  నగేష్ కుమార్ గారు.  

దాసు కేశవరావు గారు అనే మంచి మనసున్న జర్నలిస్టు తర్వాత సుసర్ల నగేష్ కుమార్ చీఫ్ ఆఫ్ బ్యూరో గా నియమితులయ్యారు ఒక ఏడు ఎనిమిదేళ్ళ కిందట. ఆయన మంచి టీం లీడర్ కాదని, నిష్కారణంగా నా మీద డిసెంబర్ 25, 2007 న అవినీతి ఆరోపణలు చేసాడని నేను గతంలో చాలా సార్లు రాశాను. మరి కొందరు జర్నలిస్టులు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తారు. 

డీ జీ పీ దినేష్ రెడ్డి విషయంలో నగేష్ క్లియర్ చేసిన ఒక బ్యానర్ వార్త 'ది హిందూ' పరువును పంచనామా చేసింది. తాను చేసిన ఘోర తప్పిదాన్ని జర్నలిజం పై దాడిగా నగేష్ అభివర్ణించి ఒక సెక్షన్ జర్నలిస్టుల మద్దతు పొందడంలో విజయం పొందారు. అప్పట్లో నగేష్ కు మొండి వాదనలతో మద్దతు ఇచ్చిన 'ది హిందూ' ఎడిటర్ సిద్దార్థ్ వరదరాజన్ కూడా యాజమాన్యం మీద అలిగి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. 

శ్రీనివాస రెడ్డి గారి లాంటి అద్భుతమైన జర్నలిస్టుకు పదోన్నతి వస్తే హర్షించి సహకరించాల్సిన నగేష్... యాజమాన్యం పై అలగడం పట్ల ఆ సంస్థ జర్నలిస్టులు ముగ్గురు నలుగురు అసహ్యం వ్యక్తం చేశారు. నగేష్ ఈ స్థాయికి ఎలా ఎదిగాడా? అని ఎప్పుడూ అనిపించే నాకు కూడా ఇది ఇబ్బంది అనిపించింది. నగేష్ గారికి పదోన్నతి ఇచ్చినప్పుడు దాసు కేశవరావు గారు కూడా ఇలానే అలిగి రాజీనామా చేయలేదు. కామ్ గా యాజమాన్యం ఇచ్చిన పని చేసి అందరి మెప్పు పొందారు. అది మరి మంచి కి, మూర్ఖత్వానికి తేడా!, అని అబ్రకదబ్ర అన్న మాటలో తప్పు లేదు.   

పొలిటికల్ రిపోర్టింగ్ లో దిట్టగా పేరున్న నగేష్ కుమార్ నిజానికి గత నవంబర్ లోనే రిటైర్ అయ్యారని, యాజమాన్యం ఆయనకు ఈ ఏడాది నవంబర్ వరకు పొడగింపు ఇచ్చిందని సంస్థ ఉద్యోగులు చెప్పారు. క్రైమ్ జర్నలిజం లో తనకంటూ ఒక చరిత్ర సృష్టించుకున్న శ్రీనివాస రెడ్డి గారు గత జూన్ నుంచి బెంగళూరు 'ది హిందూ' రెసిడెంట్ ఎడిటర్ గా ఉన్నారు. 

Nagesh ji, have a nice post-retirement life.
Sreenivasa Reddi Sir, Wish you all the best.