Wednesday, April 30, 2014

ఆంధ్ర ప్రదేశ్ లో జగన్--తెలంగాణాలో కనాకష్టంగా టీ ఆర్ ఎస్?

1) నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావడం తధ్యం 
2) ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి కావడం ఖాయం 
3) తెలంగాణలో టీ ఆర్ ఎస్ కనాకష్టంగా మాజిక్ ఫిగర్ చేరుతుంది
--గత కొన్ని రోజులుగా... మేము చేసిన సంభాషణలు, చేసిన కొద్దిపాటి ఇంటర్ వ్యూలు ఈ మూడు అంశాలను వెల్లడిస్తున్నాయి. 
"ఎనఫ్ ఫర్ కాంగ్రెస్. మోడీ షుడ్ కమ్ వన్స్," అని బాగా చదువుకుని సేల్స్ రంగంలో తలపండిన ఒక పెద్ద మనిషి ఓటు వేసి వచ్చాక ఈ ఉదయం అన్న మాటలివి. గత పదిహేను రోజులుగా చూస్తే... మేము కలిసిన చాలా మంది ఇదే భావాన్ని వెలిబుచ్చారు. "ఈయన వస్తే... ప్రమాదం...," అని అన్న వాళ్ళ సంఖ్య తక్కువగా ఉంది. మోడీ ప్రసంగంలో నాణ్యత ఉంది. అభివృద్ధి పట్ల ఆకాంక్ష ఉందన్న అభిప్రాయం కలుగుతున్నది జనంలో. 

అటు చేసి ఇటు చేసి చంద్రబాబు నాయుడు గారు మోడీ సరసన చేరడం, పవన్ కళ్యాణ్ కు భయకరమైన ఫాలోయింగ్ ఉందని మోడీ అనుకోవడం, మోడీ గాలి పసిగట్టి... తనను పట్టించుకోకపోయినా బాబు వెళ్లి పవన్ కళ్యాణ్ ను కలవడం చాలా మందికి వింతగా అనిపిస్తాయి. కాంగ్రెసోళ్ళు, ఎర్ర కామ్రేడ్లు మోడీ ని తిట్టి పోస్తున్నా.... మేధావి జయప్రకాష్ నారాయణ్ గారు కూడా మోడీ జపం చేయడం, ఈనాడు యాజమాన్యం అందుకు మంచి ప్రచారం ఇవ్వడం జరిగిపోతున్నాయి. మోడీ గనక ఒకవేళ ప్రధాని అయితే.. ఆయనకు మచ్చ తెచ్చి గద్దె దిగేలా చేయడం కోసం   హైదరాబాద్లో కల్లోలం సృష్టిస్తారేమో...అన్న అనుమానం కలిగే పక్షులూ ఉన్నాయి. 

హస్తినలో మోడీ స్థాయిలో జగన్ మోహన్ రెడ్డి సీమాంధ్ర లో మూడ్ సృష్టించడం స్పష్టంగా కనిపిస్తున్నది. నేపథ్యం, తెలివి, పరిస్థితులు, డబ్బు...విడివిడిగా కలివిడిగా జగన్ కు అనుకూలంగా అనిపిస్తున్నాయి. జగన్ పరిస్థితి బాగోలేదని అనే వాళ్ళే కనిపించడం లేదు. ఒక ప్రైవేటు సంస్థ ప్రతినిధి...వాళ్ళు చేయించుకున్న ఒక సర్వేను ఉటంకిస్తూ... జగన్ కు 160 సీట్లు వస్తాయని చెప్పడం మాకు ఆశ్చర్యం కలిగించింది. ఇది మామూలు విషయం కాదు. ఇదే జరిగితే తెలుగు దేశం పార్టీ ఖేల్ ఖతం. 
 "ఈనాడు, ఆంధ్ర జ్యోతి పుణ్యాన...జగన్ అవినీతి జనాలకు ఒక పట్టింపు గా లేదు. ఆవు-పులి కథలా ఎవ్వారం మారి... జగన్ ను జనం ఆరాధిస్తున్నారు," అని జర్నలిస్టుగా పనిచేసి రాజకీయాలను అధ్యయనం చేసే ఒక మిత్రుడు చెప్పారు. అది నిజమే మరి. రోజూ చచ్చే వాడి కోసం ఏడ్చే వాడు ఎవడూ ఉండదు.  దక్షిణ తెలంగాణా జిల్లా ఖమ్మం లో ఒక ఎంపీ సీటు, కనీసం మూడు అసెంబ్లీ సీట్లు జగన్ పార్టీ కి రాబోతున్నాయని క్షేత్ర స్థాయి మిత్రులు కట్టిన అంచనా. ఇది జరిగితే అది పెద్ద ఆశ్చర్యం కాక మరేంటి? 
 
రాష్ట్రం ముక్కలైనా... పట్టు వదలని విక్రమార్కుడిలా... సమైక్య నినాదం తో ముందుకు పోతున్న కిరణ్ కుమార్ రెడ్డి వాదన అరణ్య రోదన అయిపోతున్నది. ఒక రాష్ట్రాన్ని నిర్మించే సత్తా ఉన్న నాయకుల్లో బాబు ముందు ఉంటారు. మరి ఆయనను ఆ వైపు ప్రజలు ఎందుకు ఆదరించడం లేదో తెలియదు.  

ఇక ఈ రోజు పోలింగ్ జరిగిన తెలంగాణా లో ఉన్నట్టుండి తెలంగాణా రాష్ట్ర సమితి పుంజుకున్నట్లు ఒక అంచనా. రాష్ట్రం తెచ్చిన చాంపియన్ కే సీ  ఆర్ అని జనం నమ్మక తప్పదు. అది ఆయనకు కలిసి వచ్చింది. లోక్ సభ సీట్ల విషయం ఎలా ఉన్నా... తెలంగాణా అసెంబ్లీ సీట్ల విషయంలో మాత్రం జనం ఆయన్ను కాదనలేని పరిస్థితి... ఆయన కుటుంబ పాలన వ్యవహారం మీద కొద్దిగా ఏవగింపు ఉన్నా. 

"టీ ఆర్ ఎస్ కు 50-52 సీట్లు వస్తాయి. మిగిలిన లెక్క పూర్తి చేయడం ఆయనకు పెద్ద కష్టం కాకపోవచ్చు," అన్నది ఒక మిత్రుడి విశ్లేషణ. అదే అయితే... మాటల మాంత్రికుడు తెలంగాణా ముఖ్యమంత్రి కావడం ఖాయం. ఓటరు ప్రభువు... నిజంగా ఏమి తీర్పు ఇచ్చాడో తెలియాలంటే... ఈ 'ఇఫ్ అండ్ బట్" లెక్కలు, ఊహాగానాలు మాని కొన్ని రోజులు ఎదురు చూడాలి. ఏది ఏమైనా రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి సాధించి... తెలుగు ప్రజలకు సుఖ శాంతులు ఇవ్వాలని అందరం కోరుకోవాలి. 

Sunday, April 6, 2014

తెలంగాణా కోసం సిద్ధమవుతున్న ఛానెల్స్

తెలంగాణా ఏర్పాటు కావడంతో ప్రధాన తెలుగు ఛానెల్స్ ఆ రాష్ట్రం లో ప్రసారాల కోసం ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నాయి. ప్రముఖ 'ఈనాడు' గ్రూపు ఈ నెల తొమ్మిదిన Etv-3 ని తెలంగాణా ఛానెల్ ను ఆరంభిస్తున్నది. 

సాక్షి వాళ్ళు కూడా తెలంగాణా ఛానెల్ కోసం ఒక ఛానెల్, హైదరాబాద్ కోసం ఒక ఛానెల్ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారమ్. 

తెలంగాణా కోసం..ఎన్నికల తర్వాత NTV Plus పేరిట ఒక ఛానెల్ ఏర్పాటు చేయాలని దాని యజమాని నరేంద్ర చౌదరి భావిస్తున్నట్లు ఇన్ సైడ్ వర్గాల కథనమ్. ఎన్ టీవీ ని ఆయన ప్రత్యేకించి ఆంధ్రా ప్రేక్షకుల కోసం వాడుకుంటారట.

దాదాపు అన్ని ఛానెల్స్ రెండు రాష్ట్రాల కోసం ప్రత్యేక డెస్క్ లు వగైరా ఏర్పాటు చేస్తుండగా... మార్కెట్ లీడర్ టీవీ నైన్ మాత్రం ఈ దిశగా ఏమీ ఏర్పాట్లు చేయడం లేదు. తెలుగు వీక్షకుల కోసం ప్రాధాన్యాన్ని బట్టి ఒకే ఛానెల్ ద్వారా వార్తలు అందించాలని రవి ప్రకాష్ భావిస్తున్నారని సమాచారం.   

Thursday, April 3, 2014

ప్రముఖ స్పోర్ట్స్ ఎనలిస్టు నరేందర్ మృతి...సంతాప సభ శనివారం

ఆంధ్రజ్యోతి, ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రికలలో స్పోర్ట్స్ జర్నలిస్టు గా పనిచేసి...మంచి క్రికెట్ విశ్లేషకుడిగా పనిచేస్తున్న రేవెల్లి నరేందర్ గారు నిన్న మరణించారు. ఆయన వయస్సు 49 సంవత్సరాలు. ఆయన సతీమణి ఉష గారు ఆల్ ఇండియా రేడియో లో న్యూస్ రీడర్ గా పనిచేస్తున్నారు.

సొంత పట్టణమైన కరీంనగర్ లో 'జీవగడ్డ' అనే పత్రిక ద్వారా జర్నలిజం లోకి అడుగుపెట్టిన నరేందర్ గారు 1996 లో ఆంధ్రజ్యోతి లో స్పోర్ట్స్ విభాగం లో చేరారు. 1996  ప్రపంచ కప్ క్రికెట్ పోటీలతో పాటు అనేక జాతీయ, అంతర్జాతీయ టోర్నమెంట్లను ఆయన కవర్ చేసారు. ఆ తర్వాత హైదరాబాద్, భువనేశ్వర్ లలో ఇండియన్ ఎక్స్ ప్రెస్ కోసం పనిచేసారు.
ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్ లలో ఫ్రీలాన్సర్ గా, అసోసియేటెడ్ ప్రెస్ కు కంట్రి బ్యూటర్ గా సేవలు అందించారు. ఆయన మూర్తి పట్ల ఆంధ్ర ప్రదేశ్ స్పోర్ట్స్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసింది.  ఇందుకు సంబంధించిన సంతాప సభను వచ్చే శనివారం ప్రెస్ క్లబ్ లో సాయంత్రం నాలుగు గంటలకు ఏర్పాటు చేసినట్లు అసోసియేషన్ ఒక ప్రకటనలో తెలిపింది.